తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వాడుక భాషలో రచనలు ఉండాలని జీవితాంతం ఉద్యమించిన వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకోవడం, ఆ మహనీయుని కృషిని సమర్థించుకునే అవకాశం తెలుగువారిగా మనకు దక్కిందన్నారు. అమ్మ జన్మనిస్తే, మాతృభాష తెలుగు మన జీవితాలకు వెలుగునిస్తోందన్నారు. ఇంగ్లీషు మీడియం, విదేశాల్లో చదువు వల్ల తాను మొదట్లో తెలుగులో మాట్లాడేటప్పుడు పదాలు అటు ఇటు అయితే.. ఎంతో బాధపడేవాడినని నారా లోకేష్ తెలిపారు. అచ్చమైన తెలుగులో నిత్యం జనంతో మాట్లాడుతూ ఉంటే మాతృభాష మాధుర్యం ఎంత గొప్పదో తెలుస్తోందన్నారు. తన కుమారుడు దేవాన్ష్‌కి ప్రత్యేకంగా తెలుగు మాట్లాడటమే కాదు.. చదవటం, రాయటం కూడా నేర్పిస్తున్నానని లోకేష్ తెలిపారు. తెలుగువారిగా గర్వపడదాం.. తెలుగు భాష పరిరక్షణకు కృషి చేద్దామన్నారు. తెలుగు భాషని సుసంపన్నం చేస్తున్న తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నానని నారా లోకేష్ తెలిపారు.