పర్యావరణ హితం కోరుతూ విద్యాధరపురంలో 72 అడుగుల విజయ గణపతి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. విజయవాడ లేబర్ కాలనీ స్టేడియం గ్రౌండ్స్ వద్ద భారీ గణేశ్ మట్టి విగ్రహ నమూనా ఆవిష్కరణలో ఎంపీ కేశినేని శివనాథ్‌తో కలిసి మంత్రి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ అమరావతి పునర్వైభవం కోరుతూ డూండీ గణేశ్ సేవా సమితి నిర్వాహకుడు డూండీ రాకేశ్ పర్యవేక్షణలో ఖైరతాబాద్ తరహాలోనే విగ్రహం రూపొందించి వినాయక ఉత్సవాలు నిర్వహించాలని తలపెట్టడం అభినందనీయమన్నారు. తిరుమల, ఇంద్రకీలాద్రి, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, చిన్నతిరుపతి, సింహాచలం, అన్నవరం దేవస్థానాల అర్చకుల పర్యవేక్షణలో నిత్య కల్యాణోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించడానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మకు ఇచ్చే నవహారతులను దసరా నవరాత్రి ఉత్సవాల నుంచి ప్రారంభించ డానికి సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి వెల్లడించారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండటంతో పాటు అమరావతికి పూర్వ వైభవం కోసం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్య నారాయణ, టీడీపీ నాయకులు, సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.