బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఇవాళ (శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అతిభారీ, భారీ, మోస్తరు వర్షాలు కురిస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూర్మనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 నంబర్లకు ఫోన్ చేయాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాథ్ సూచించారు. బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా వెల్లడించారు. అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపు పయనిస్తోందని, మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు చెప్పారు. దీని వల్ల ఇవాళ, రేపు ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్టెల్లా తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ఆదివారం వరకు సముద్రం అలజడిగా ఉంటుందని పేర్కొన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 44నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయనున్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే హెల్ప్ లైన్ నంబర్లు ఫోన్ చేయాలని సూచించారు.