రాజధాని అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సిటీగా ఉండాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ఫురణకు వచ్చేలా అమరావతి పేరులో మొదటి అక్షరం ‘ఏ’, చివరి అక్షరం ‘ఐ’ కలిసి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలన్నారు. రాజధానిలో ఎటు చూసినా సాంకేతిక సౌలభ్యత ఉట్టిపడేలా నిర్మాణం ఉండాలన్నారు. అమరావతి దేవతల రాజధాని అని, అలాంటి గొప్ప రాజధాని పట్ల గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి రాజధానిని భ్రష్టు పట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన 37వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పురపాలక మంత్రి నారాయణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘అమరావతి లో త్వరలో అన్ని పనులకూ టెండర్లు పిలిచి జనవరి ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభించేలా ముందుకెళ్తాం’ అని తెలిపారు. రాయపూడి సమీపంలో సీడ్ యాక్సిస్ రోడ్డును ఆనుకుని సీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రభుత్వం నిర్మిస్తుందని, ఈ భవనం నిర్మాణానికి రూ.160 కోట్లు కేటాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుందన్నారు. జీ ప్లస్ 7 విధానంలో 3.62 ఎకరాల్లో తలపెట్టిన సీఆర్‌డీఏ కార్యాలయాన్ని గత టీడీపీ ప్రభుత్వంలో ఏ మాత్రం చేపట్టామో అంతకు మించి అంగుళం నిర్మాణం కూడా ముందుకు కదల్లేదని అధికారులు తెలపగా, దీనిని 90 రోజుల్లో పూర్తి చేసి కొత్త కార్యాలయాన్ని అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.