కొత్త మద్యం పాలసీని పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోకి తీసుకొస్తున్నారు. దరఖాస్తుల నుంచి లాటరీ వరకూ మొత్తం ఆన్‌లైన్‌లోనే ప్రక్రియ చేపడతారు. తొలుత లాటరీకి వెళ్లాలా? వేలం ప్రక్రియ చేపట్టాలా? అనే అంశాలపై కసరత్తు చేశారు. వేలం విధానంలో ప్రారంభంలో ఆదాయం ఎక్కువ వచ్చినా, ఆ తర్వాత స్థిరత్వం ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎక్కువ ధరకు లైసెన్స్‌లు పొందినవారు మధ్యలోనే షాపును వదిలేస్తే అది ఆదాయ నష్టంతో పాటు, ఇతర అంశాలపైనా ప్రభావం చూపుతుందని, అందువల్ల లాటరీ విధానంలో ఎంపిక చేయడమే ఉత్తమమని భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తొలిసారి బార్ పాలసీని ఆన్‌లైన్ విధానంలో నిర్వహించారు. అది వేలం విధానం కాగా ఇప్పుడు లాటరీ ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేపట్టనున్నారు. అలాగే పాత విధానం తరహాలో షాపుల్లో పర్మిట్ రూమ్‌లకు అనుమతులు ఇవ్వనున్నారు. గతంలో ప్రైవేటు షాపు పక్కనే మద్యం సేవించేందుకు పర్మిట్ రూమ్ ఉండేది. ప్రభుత్వ షాపుల విధానంలో వాటిని తొలగించారు. దానివల్ల మందుబాబులు రోడ్లపైనే మద్యం తాగే దుస్థితి వచ్చింది. దానిని అరికట్టేందుకు రూమ్‌లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.