నెల్లూరు జిల్లా మత్స్యకారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్‌ను ప్రధాని మోదీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఆయన ఇదేరోజు మహారాష్ట్రలోని వాద్వాన్ పోర్టును ప్రారంభించనున్నారు. ఆ సందర్భంగా జువ్వలదిన్నె హార్బర్ సహా దేశవ్యాప్తంగా 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు.. శంకుస్థాపన చేయనున్నారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో మధ్యాహ్నం ఒంటిగంటకు జరిగే ఈ కార్యక్రమంలో మోదీ వర్చువల్ విధానంలో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 2014-19లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పురుడు పోసుకున్న జువ్వలదిన్నె హార్బర్‌కు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా ఖర్చు భరించేలా రూ.288 కోట్ల అంచనాతో రూపకల్పన చేశారు. స్థలసేకరణ పూర్తిచేసి అప్పగించారు. నిర్మాణానికి అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు. తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో చేపట్టిన పనుల్లో మందగమనం కనిపించింది. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు ఆపేశారు. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించి చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యారు. కొత్త కాంట్రాక్టర్‌తో పనులు పూర్తిచేయించారు.