ప్రభుత్వంలోని 16 శాఖల్లో బదిలీల గడువును పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్సైజ్ మినహా మిగిలిన శాఖల్లో బదిలీలను ఆగస్టు 31లోగా పూర్తి చేయాలని ఈ నెల 17వ తేదీన ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కానీ దాదాపు అన్ని శాఖల్లోనూ బదిలీలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం, ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ ఉన్న నేపథ్యంలో బదిలీలు నిర్వహిస్తే ఆ కార్యక్రమానికి ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతో గడువు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్సైజ్ పాలసీని కొత్తగా రూపొందిస్తున్నందున అది పూర్తయ్యాక ఆ శాఖలో బదిలీలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబరు 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎక్సైజ్‌లో బదిలీలు ఉంటాయని ప్రభుత్వం గతంలో తెలిపింది. ఇప్పుడు అన్ని శాఖల బదిలీల గడువును సెప్టెంబరు 15వ తేదీ వరకు పొడిగించింది. 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.