ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, చింతలపూడి నగర పంచాయతీ లో జ్వరాల జోరు తగ్గడం లేదు. ఒక ఇంట్లో ఒకరికి వస్తే ఇంటి ల్లిపాది జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరాలు రెండు, మూడు రోజుల్లో తగ్గినా కాళ్ల వాపులు, కీళ్ల నొప్పులు నెల రోజులు గడు స్తున్నా తగ్గటం లేదు. ఏరియా ఆసుపత్రిలో వచ్చే రోగుల్లో జ్వర పీడితులే అధికంగా ఉన్నారు. జ్వరం లేకపోయినా వాపులతో నడవలేని పరిస్థితి. ఏ ఒక్కరిని పలకరించినా ఇదే ఆవేదన. సీజన్‌లో జ్వరాలు వచ్చినా నాలుగు, ఐదు రోజులు మాత్రమే ఉండేవి. కీళ్ల నొప్పులు, కాళ్ల వాపులు ఉండేవి ఎరుగం. ఇప్పుడు ఇవేం వాపులో అంటూ వాపోతున్నారు. కొందరికి ముఖంపై నల్లమచ్చలు వస్తున్నాయి. జ్వరం వచ్చిందని అడ్డగోలుగా యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్ ట్యాబ్‌లెట్లు వాడటం మంచిది కాదని చెబుతున్నారు. జ్వరం తగ్గిన తరువాత ఆహారం పై నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్లు సలహా ఇస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. కొందరికి 50 రోజులు దాటిన వారు ఈ వాపుల తో బాధపడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ సేవలు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాయి. ఇన్ని రోజులు గడుస్తున్నా ఎక్కడా ప్రజల కు ఈ వ్యాధులపై అవగాహన కల్పించిన దాఖలాలు లేవు. ఇంటింటా సర్వే లేదు. ధైర్యం చెప్పే వారు లేక ఇవి దీర్ఘకాలిక రోగాలుగా మారుతాయా ? అన్న భయంతో రోగులు తల్ల డిల్లుతున్నారు. రాత్రి అయితే వాపుల నుంచి వచ్చే నొప్పులకు నిద్ర కూడా పోనివ్వడం లేదు. మరోపక్క దోమల బెడద తీవ్రంగా ఉంది. గతంలో సీజనల్ వ్యాధులు వస్తున్నాయంటే ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖలు అప్రమత్తంగా ఉండేవారు. నగర పంచాయతీలో ప్రతి వీధి శానిటేషన్, దోమల నివారణకు చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం నగర పంచాయతీలో ఈ సేవలు తక్కువగా ఉన్నాయి. అర్బన్ సెంటర్ వచ్చినా ఎక్కడా వారి సేవలు కనిపించడం లేదు. కేవలం కార్యాలయాలకే పరిమి తమయ్యారు. దోమలు అరికట్టండి, పరిశుభ్రత పాటించండి అంటారే తప్ప వీధులు, ప్రధాన రోడ్లలో డ్రైనేజీ, వాటి ద్వారా వ్యాపించే దోమల నివారణకు చర్యలు కనిపించవు అని ప్రజలు వాపోతున్నారు.