ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని బీజేపీ నేత లంకా దినకర్ తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి వివిధ ఏజెన్సీల ద్వారా రూ. 15 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం సమకూర్చడంతో... త్వరలోనే అమరావతి పనులు ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. ఐదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని అమరావతికి మంచి రోజులు వచ్చాయని అన్నారు. ఏపీని రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని చంద్రబాబు ప్రకటిస్తే... దాన్ని సాకారం చేయడానికి ప్రధాని మోదీ తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. గత జగన్ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ ద్వారా అనేక ప్రాజెక్టుల్లో జాప్యం జరిగిందని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రం వాల్ దెబ్బతిని ప్రభుత్వంపై వెయ్యి కోట్ల అదనపు భారం పడిందని చెప్పారు. ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో, కొప్పర్తిలో 2,596 ఎకరాల్లో పారిశ్రామిక హబ్ ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై లంకా దినకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ హబ్ ల వల్ల రాయలసీమలో దాదాపు లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.