దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు గ్రామాలు నీట మునిగాయి. రోడ్లుపై రాకపోకలకు అవకాశమే లేకుండా పోయింది. కొన్ని ప్రాంతాల్లో కనుచూపు మేరలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. వరద నీరు ఇండ్లళ్లోకి వచ్చి చేరుతోంది. రోడ్ల పై పార్క్ చేసిన కార్లు, బైకులు, ఇతర వాహనాలు, వస్తువులు అన్ని వరదల్లో కొట్టుకుపోతున్నాయి. వందల సంఖ్యలో ఇండ్లు ధ్వంసమయ్యాయి. వరదల ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది మృతి చెందారు. నీట మునిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అధికారులు 18 వేల మందిరి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కొన్న ప్రాంతాల్లో వరద నీటిలో మొసళ్లు కొట్టుకురావడం కలకలం రేపింది.
ఇంట్లో దాకా మొసళ్లు రావడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. రాష్ట్రంలో నదులు, డ్యామ్‌లు నిండుకుండల్లా మారాయి. నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఈ కారణంగా మొసళ్లు గ్రామాల్లోకి కొట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో వడోదర జిల్లాలోని విశ్వామిత్ర నది నుంచి భారీ సంఖ్యలో మొసళ్లు జనావాసాల్లోకి వచ్చాయి. వడోదరలోని మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ క్యాంపస్‌లోని జువాలజీ విభాగానికి సమీపంలో 11 అడుగుల మొసలిని స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.అధికారులు స్థానికుల సాయంతో మొసలిని సురక్షితంగా బంధించారు. వడోదరలోనే మరో ప్రాంతమైన అకోటాలో కూడా ఓ మొసలి ఇంటి పైకప్పు ఎక్కడం స్థానికంగా కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.