బీజేపీలో వైసీపీ నేతల చేరికలపై చర్చలు జరుగుతున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి అన్నారు. గుంటూరులో నిర్వహించిన భాజపా కిసాన్ మోర్చా, ఎస్సీ మోర్చా సమావేశాల్లో ఆమె మాట్లాడారు. వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరే విషయమై తమకు సమాచారం లేదని వెల్లడించారు. కొల్లం గంగిరెడ్డి పార్టీలో చేరడంపై తాము నిర్ణయం తీసుకోలేదన్నారు. నేతలను చేర్చుకునే అంశంలో అన్ని స్థాయిల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. వైసీపీ నేతలు బీజేపీ సిద్ధాంతాలకు అంగీకరిస్తేనే చేర్చుకుంటామని స్పష్టం చేశారు.
వైసీపీ నుంచి వచ్చే ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల చేరికపైనా ఇదే విధానం పాటిస్తారని వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీపై ఇండియా కూటమి చేసిన దుష్ప్రచారం వల్లే 50-60 సీట్లు తగ్గాయని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీకి 18 కోట్ల మంది సభ్యులుంటే.. ఏపీలో 35 లక్షల మంది ఉన్నారన్నారు. సెప్టెంబర్ 2న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రధాని మోడీ మొదటి సభ్యుడిగా పేరు నమోదు చేసుకుంటారని, తర్వాత దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో సభ్యత్వ నమోదును పెంచేందుకు పార్టీ నేతలు కృషి చేయాలని సూచించారు. నామినేటెడ్ పదవుల విషయంలో కూటమిలో చర్చలు జరుగుతున్నాయని పురందేశ్వరి తెలిపారు.