అన్నవరంలో ఓ రెస్టారెంట్ చుట్టూ వివాదం నడుస్తోంది. రెండు ప్రభుత్వ శాఖల మధ్య వార్ నడుస్తోంది.. తాజాగా మరోసారి ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అన్నవరం పంపా రిజర్వాయర్‌ని ఆనుకుని అభయ్ హోటల్ రిసార్ట్ ఉంది. అక్కడ స్థలం విషయంలో వివాదం రేగింది. ఈ హోటల్ రిసార్ట్ స్థలం తమదంటే తమదని ఇరిగేషన్, దేవస్థానం అధికారుల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. గురువారం రోజు మండల సర్వేయర్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ ఆధ్వర్యంలో దేవస్థానం, ఇరిగేషన్ అధికారుల సమక్షంలో ఆ స్థలానికి మార్కింగ్‌లు వేశారు.
అభయ్ హోటల్ రిసార్ట్ నిర్మాణం అన్నవరం దేవస్థానం స్థలంలో జరిగిందని.. గతంలో హోటల్ రిసార్ట్ ఆనుకుని ఉన్న సత్యమేవజయతే అనే ఆర్చి ఇప్పటికీ కనిపిస్తోందని దేవాదాయశాఖ అధికారులు అంటున్నారు. ఈ మేరకు కొన్ని ఆధారాలను కూడా తెరపైకి తీసుకొచ్చింది. అయితే ఇరిగేషన్ అధికారుల వాదన మరోలా ఉంది.. 1964లో ఈ స్థలంలో బండిమార్గం మాత్రమే ఉండేదని.. రిజర్వాయర్ హద్దులు కూడా లేవని చెబుతున్నారు. ఇలా ఇరు శాఖ అధికారులు ఈ స్థలంపై తమ వాదనల్ని వినిపించారు.
దేవాదాయ, ఇరిగేషన్ అధికారుల వాదనలు విన్న సర్వే అధికారులు.. ఆ స్థలంలో సర్వే చేసి బౌండరీ లైన్ మార్కింగ్ వేశారు. సర్వే అధికారులు ఈ స్థలాన్ని అన్నవరం ఆలయానికి చెందినదిగా తేల్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ స్థలం విషయంలో చేసిన సర్వేను అన్నవరం ఆలయానికి అనుకూలంగా చేశారని.. ఇరిగేషన్ అధికారులు సంతకాలు పెట్టలేదని సమాచారం. అందుకే ఈ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది అంటున్నారు. చివరికి సర్వే అధికారులు.. ఈ స్థలానికి సంబంధించిన నివేదికను వచ్చే నెల రెండు, మూడు తేదీల్లో అందజేస్తామని చెప్పారట. సర్వే సమయంలో దేవస్థానం తరపున.. ఇరిగేషన్‌శాఖ తరఫున అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. మరి ఈ రెస్టారెంట్ స్థలం విషయంలో సర్వే చేసిన అధికారులు ఎలాంటి నివేదిక ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ స్థలం వ్యవహారంపై సర్వే అధికారులు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది కూడా చూాడాలి..