తిరుమలలో ఓ క్యాంటీన్ వ్యవహారం హైకోర్టుకు చేరింది. కొండపై క్యాంటీన్ నిర్వహణకు అనుమతి పొందిన ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ.. దాన్ని సబ్‌లీజు ఇచ్చేందుకు టెండర్ పిలవడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం వ్యక్తం చేసింది. ఆ క్యాంటీన్‌కు సబ్‌లీజు ఎలా ఇస్తారని ప్రశ్నించిన కోర్టు.. పూర్తి వివరాలు సమర్పించాలని టీటీడీ ఈవోను ఆదేశించింది. ఈ మేరకు విచారణను సెప్టెంబర్ 4కు వాయిదా వేసింది.
తిరుమలలో క్యాంటీన్ నిర్వహణకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ టీటీడీ నుంచి అనుమతిని తీసుకుంది. ఈ మేరకు లైసెన్సు జారీ చేయగా.. దానిని తిరిగి సబ్‌లీజుకు ఇవ్వబోతున్నారని సికింద్రాబాద్‌కు చెందిన సురవరం ప్రతాప్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ క్యాంటీన్‌ను థర్డ్ పార్టీకి సబ్‌లీజ్ ఇచ్చేందుకు పర్యాటకాభివృద్ధి సంస్థ గత జులైలో ప్రకటన జారీ చేసిందని, సబ్‌లీజ్‌పై నిషేధం ఉందని పిటిషనర్ తరఫు లాయర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. సబ్ లీజ్‌కు ఇవ్వడం చట్ట విరుద్ధమన్నారు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పూర్తి వివరాలు సమర్పించాలని టీటీడీ ఈవోను ఆదేశించింది.
తిరుమలలో వన మహోత్సవం
తిరుమలలో జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలరావు పాల్గొన్నారు. ప్రతి ఏడాది వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించడం అనవాయితీగా వస్తోందని.. అటవీ ప్రాంతంలో 10 వేల మొక్కలు, ఇతర ప్రాంతాలలో మరో 2వేల మొక్కలు నాటుతామన్నారు. సీడ్ బాల్ విధానం ద్వారా మరిన్ని మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతామని.. ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాలకు కావాల్సిన ఆయుర్వేదిక్ మొక్కల పెంపకం చేపడుతామన్నారు. త్వరలోనే ఆయుర్వేదిక్ మొక్కల పెంపకంపై విధివిధానాలు రూపొందిస్తామన్నారు.
తిరుమల శ్రీవారికి 16 బైక్‌లు విరాళం
చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్స్ ఎండీ వేణు సుదర్శన్ తిరుమల తిరుపతి దేవస్థానానికి 16 బైక్‌లు విరాళంగా అందజేశారు. తిరుమల శ్రీవారి అలయం ఎదుట ఈ వాహనాలకు పూజలు నిర్వహించిన తర్వాత దాత ఈ వాహనాల తాళాలను టీటీడీ అధికారులకు అందజేశారు. వీటిలో 15 ఎలక్ట్రికల్ వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల ధర సుమారు రూ.22 లక్షలు ఉంటుందని సంస్థ ప్రతినిధులు చెప్పారు.