కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసన కారులను సీఎం బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాలేజీలు, స్కూళ్లు, ఆస్పత్రులకు నోటీసులు జారీ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండాపోయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతం జరుగుతన్న నిరసనలను పోలీసులతో సీఎం అణచివేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ మహిళా మోర్చా నిరసలు..
ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా బీజేపీ మహిళా మోర్చా కోల్‌కతా వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా విపక్షాలు నినాదాలు చేశాయి. దీంతో నగరమంతా భారీ సంఖ్యలో పోలీస్ బలగాలు మోహరించారు. బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ సహా పలువురు నేతలు, మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాని మోడీకి బెంగాల్ సీఎం లేఖ
కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి మరో లేఖ రాశారు. హత్యాచార ఘటనలకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠిన చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలాగే నిర్దిష్ట కాలపరిమితిలో కేసుల్ని పరిష్కరించేలా చట్టం ఉండాలని మరోసారి తన లేఖలో పేర్కొన్నారు. ఈ సున్నిత అంశంపై ప్రధాని నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ప్రశ్నించారు. గతంలో రాసిన లేఖపై ప్రధాని సమాధానం రాలేదని విచారం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి మాత్రమే బదులొచ్చిందన్నారు. ఈ ఘటనపై వారం రోజుల క్రితమే సీఎం మమతా మోడీకి తొలిసారి లేఖ రాశారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలను ప్రధాని దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానన్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 90 అత్యాచార ఘటనలు జరుగుతుండటం భయానక పరిస్థితిని సూచిస్తోందని వెల్లడించారు. ఇలాంటి చర్యలు సమాజం, దేశం విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని, ఈ దురాగతాలకు ముగింపు పలికి మహిళలకు సురక్షితంగా, భద్రంగా ఉన్నామన్న భావన కలిగేలా చేయాలని కోరారు.