ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తోంది. వర్ష ప్రభావంతో జనం ఇళ్లలోనే ఉండిపోయారు. కొన్ని చోట్ల బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వర్షాలపై మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘మరో మూడు రోజులు వర్షం ప్రభావం ఉండనుంది. అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించా. భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తతో ఉంటే ప్రజల ఇబ్బందులను తగ్గించొచ్చు. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై భారీ స్థాయిలో నీరు చేరి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోంది. పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టి, ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలి అని’ అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.