అల్పపీడనం ప్రభావంతో కృష్ణాజిల్లా అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అప్రమత్తం చేశారు. వర్షాల వల్ల ప్రజలెవ్వరూ ఇబ్బందులకు గురి కాకుండా చూడాలన్నారు. అలాగే టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులకు కలెక్టర్ బాలాజీ పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ... భారీ వర్షాల నేపథ్యంలో అధికారులందరినీ అప్రమత్తం చేశామన్నారు. లోతట్టు ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. లంక గ్రామాల ప్రజల కోసం నెల రోజుల సరిపడా నిత్యావసర వస్తువులను సిద్ధం చేశామన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అత్యవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ బాలాజీ వెల్లడించారు.