ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యాక మాజీ మంత్రి రోజా పార్టీ మారుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్నారని.. తమిళనాడులో విజయ్ పార్టీలో చేరతారని టాక్ నడుస్తోంది. దీనిపై తొలిసారిగా ఆమె స్పందించారు. తిరుమల శ్రీవారిని రోజా నేడు దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారం ఊహాగానమేనన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో మహిళలపై జరిగిన ఘటనల పట్ల ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు. ముచ్చుమర్రిలో ఘటన జరిగి 60 రోజులు అవుతున్నా ఆ పాప శవాన్ని ఇంకా కనిపెట్టలేకపోయారని విమర్శించారు. గుడ్లవల్లేరులోని హాస్టల్‌లో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు ఫిర్యాదు చేసినా ఏమి జరగలేదని ఎస్పీ చెప్పడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వ హయంలో ర్యాగింగ్ విపరీతంగా పెరిగిందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపైన పెట్టిన దృష్టిని పక్కన పెట్టి.. ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంపై దృష్టి సారించాలని రోజా విమర్శించారు. పార్టీలు మారే వారిని ప్రజలు విశ్వసించరని అన్నారు . ఎంత మంది పార్టీని వీడినా వైసీపీకీ వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు.