ఐరోపా దేశాల్లో గుర్తించిన మంకీ ఫీవర్ రాష్ట్రంలో వ్యాపించకుండా పటిష్టమైన నిరోధక చర్యలు చేపడుతున్నట్లు తమిళనాడు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. కోయంబత్తూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి వెళ్ళారు. అక్కడి విమానాశ్రయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐరోపాలో గుర్తించిన మంకీ ఫీవర్ ప్రస్తుతం 121 దేశాలకు వ్యాపించిందని, ఆ వైరస్ వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించిందని తెలిపారు. రాష్ట్రంలో విదేశాల నుంచి మంకీ ఫీవర్ వ్యాపించకుండా ఉండేందుకుగాను ముఖ్యమంత్రి స్టాలిన్ సూచనల మేరకు చెన్నై, కోవై, మదురై, తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మంకీ ఫీవర్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.