పతంజలి ఆయుర్వేదిక్, బాబా రామ్‌దేవ్‌లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పతంజలి సంస్థ శాకాహారంగా విక్రయిస్తున్న హెర్బల్ టూత్ పౌడర్ 'దివ్యమంజన్లో' మాంసాహార పదార్థాలు ఉన్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు, నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయవాది యతిన్ శర్మ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రోడక్ట్‌లో చేప ఆనవాళ్లు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.అధికారిక వెబ్ సైట్లో గ్రీన్ డాట్‌తో దీనిని విక్రయిస్తోందని, ఈ గ్రీన్ డాట్ సింబల్ శాకాహారాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. అయితే, లోపల ఉన్న ఇన్‌గ్రీడియెంట్స్ పరంగా చూస్తే ఇది విరుద్ధంగా ఉందని అన్నారు. ఆ ఉత్పత్తిలో చేపల నుంచి తయారు చేసిన 'సముద్ర ఫెన్' అనే పదార్థాన్ని వాడినట్లు ఇటీవలే జరిపిన పరిశోధనల్లో వెల్లడైందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాబట్టి దివ్యమంజన్‌ను శాకాహార ఉత్పత్తిగా పేర్కొనవద్దన్నారు.తాను, తన కుటుంబ సభ్యులు శాకాహారం మాత్రమే తీసుకుంటామని, దివ్యమంజన్‌లో చేప మూలాలు ఉన్నాయని తెలిసి తాను మనస్తాపం చెందినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు... స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలకు కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేసింది.