ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు ముంచెత్తాయి.. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం అర్ధరాత్రి విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నంకు దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణశాఖ.ఈ ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీవర్షాలకు అవకాశం ఉందంటున్నారు. మిగిలిన చోట్ల మోస్తరు వానలు పడతాయంటున్నారు.
ఈ వర్షాలతో పాటూ కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయంటోంది ఏపీ విపత్తుల సంస్థ. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాలువలు,కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు దూరంగా ఉండాలని.. పడిపోయిన విద్యుత్ లైన్లకు,స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. ఇవాళ శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45-65కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటున్నారు.
రాష్ట్రంలో వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు.. అలాగే జిల్లాల్లో అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని.. మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి.. లోతట్టు ప్రాంతా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచనలు చేశారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై భారీ స్థాయిలో నీరు చేరి ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ముందు ప్రజల తాగునీరు, ఆహారం కలుషితం కాకుండా పోకస్ పెట్టాలన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైన ఘటనను గుర్తు చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల తీవ్రత ఉంటుందని.. అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
రాష్ట్రంలో అక్కడక్కడా కాలువలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని.. వాటిని దాటేందుకు ప్రజలను అనుమతించవద్దన్నారు చంద్రాబు. వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా వివిధ శాఖల అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుకుని సమన్వయంతో పనిచేయాలన్నారు. డిజాస్టర్ మేనెజ్‌మెంట్ శాఖ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలపై సమాచారం ఇవ్వాలని.. భారీ వర్షాలు, వరదలపై ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు అలెర్ట్ మెసేజ్ పంపించాలని సూచించారు. విజయవాడలో ఇంటిపై కొండ చరియలు విరిగిపడిన ఘటన బాధాకరమని.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది అన్నారు.