ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేస్తోంది.. బెంగళూరులో ప్రొటోటైప్‌ను ప్రదర్శించిన రైల్వే మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 01, 2024, 08:25 PM

రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడం కోసం వేగంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను 2019లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ వందే భారత్ రైళ్లు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల మధ్య ప్రవేశపెట్టిన ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ప్యాసింజర్లు ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్లలో కూర్చొని ప్రయాణించే ఛైర్ కార్ సౌలభ్యం మాత్రమే ఉంది.


త్వరలోనే స్లీపర్ కోచ్‌లతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టడానికి ఇండియన్ రైల్వే కసరత్తులు చేస్తోంది. త్వరలోనే ప్రారంభించబోయే వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రదర్శించారు. బీఈఎంల్ రూపొందించిన ఈ రైలు.. వసతులు, ప్రయాణికుల భద్రత కోణంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు కంటే మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. వందే భారత్ స్లీపర్ టెస్టింగ్ స్పీడ్ గంటకు 180 కిలోమీటర్లు కాగా.. ఇది గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. తక్కువ సమయంలోనే గరిష్ట వేగాన్ని అందుకునేలా, వేగాన్ని తగ్గించుకునేలా ఈ రైలును రూపొందించారు.


16 కోచ్‌ల వందే భారత్ స్లీపర్ రైలు ప్రోటోటైప్‌లో 11 థర్డ్ ఏసీ కోచ్‌లు ఉండగా.. వీటిలో 611 బెర్తులు ఉంటాయి. నాలుగు సెకండ్ క్లాస్ ఏసీ కోచ్‌ల్లో 188 బెర్తులు, ఒక ఫస్ట ఏసీ కోచ్‌లో 24 బెర్తులు ఉంటాయి. వందే భారత్ స్లీపర్ రైలులో ప్రపంచ స్థాయి సదుపాయాలు ఉంటాయని రైల్వే శాఖ, ఈ రైళ్లను తయారు చేస్తోన్న బీఈఎంఎల్ చెబుతున్నాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు.. యూరప్ దేశాల స్థాయి ప్రమాణాలను అనుభూతి చెందుతారని చెబుతున్నారు.


ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. జీఎఫ్ఆర్పీ ప్యానెల్స్‌తో కూడిన బెస్ట్ ఇన్ క్లాస్ ఇంటీరియర్, ఆటోమెటిక్ ఎక్స్‌టీరియర్ ప్యాసింజర్ డోర్స్, సెన్సార్ ఆధారంగా పని చేసే ఇంటర్ కమ్యూనికేషన్ డోర్స్, ఆధునిక ప్రయాణ సదుపాయాలు, విశాలమైన లగేజీ స్థలం అందుబాటులో ఉంటాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్ ఉంటుంది. దీనికి యూఎస్‌బీ ద్వారా ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. వికలాంగుల కోసం ప్రత్యేకమైన బెర్తులు, టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు. మాడ్యులర్ ప్యాంట్రీలు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ అండ్ విజువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, లోపల వెపున ఉండే డిస్‌ప్లే ప్యానల్స్, సెక్యూరిటీ కెమెరాలతోపాటు ఫస్ట్ క్లాస్ కోచ్‌లో వేడి నీటితో కూడిన షవర్ అందుబాటులో ఉంటుంది.


రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే వందే భారత్ స్లీపర్ రైళ్లలో బెర్తులు చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. వందే భారత్ బెర్తుల్లో అదనపు కుషన్‌‌ ఉంటుంది. పై బెర్తుల్లోకి ఎక్కేందుకు ఉపయోగించే నిచ్చెనను సైతం మరింత కంఫర్ట్ కోసం రీడిజైన్ చేశారు. టాయిలెట్ల నుంచి వాసన వెలువడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


వందే భారత్ స్లీపర్ రైళ్లలో ప్రయాణించే వారి భద్రతను గరిష్ట స్థాయిలో పెంచడం కోసం బోగీల్లో క్రాష్ బఫర్స్, కప్లర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఫైర్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఎక్కువగా ఉండే పరికరాలు, మెటీరియల్స్‌ను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా రైలు ప్రయాణం జర్కులతో కూడుకొని ఉంటుంది. కానీ వందే భారత్ స్లీపర్ రైళ్లలో అలాంటి కుదుపులేవీ ఉండవు. మెరుగైన ఎయిర్ కండీషనింగ్ కారణంగా వీటిలోకి డస్ట్ కూడా రాదు. ప్రయాణికుల కోసం లాంచ్ చేయడానికి ముందు ఈ రైలును విస్తృతంగా పరీక్షించనున్నారు. మరో మూడు నెలల్లో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వందే భారత్ స్లీపర్ రైలును ముందుగా ఏ రూట్లో ప్రవేశపెడతారనే విషయంలో స్పష్టత లేదు. కానీ ఢిల్లీ-ముంబై, ముంబై-కోల్‌కతా మార్గాల్లో ముందుగా ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com