తిరుపతి (రేణిగుంట) ఎయిర్‌పోర్టులో చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ విమానం ఎంట్రీ ఇచ్చింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారిగా ఓ అంతర్జాతీయ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. 2015 నవంబరు 22న తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత అంతర్జాతీయ విమానాల రాకపోకలు కొనసాగాయి.. అంతర్జాతీయ విమాన రాకపోకల కోసం అన్ని వసతులను కల్పించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఫోకస్ పెట్టలేదనే విమర్శలు వచ్చాయి.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా.. మూడు నెలల్లోపే అంతర్జాతీయ విమానం ల్యాండ్ అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం 12.11 గంటలకు బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎంపైర్ ఏవియేషన్ విమానం తిరుపతి ఎయిర్‌పోర్టుకు వచ్చింది. గల్ఫ్‌లో కేరళకు చెందిన ప్రవాస భారతీయుడు డాక్టర్ రవిపిళ్లై కుటుంబ సభ్యులతో కలిసి ఈ విమానంలో శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చారు. ఏటా శ్రీవారి దర్శనానికి వచ్చే పిళ్లై ఈసారి కేంద్రం అనుమతితో ప్రత్యేక విమానంలో వచ్చారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపడానికి ఇది తొలి అడుగుగా భావిస్తున్నారు. రవిపిళ్లైకి విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ స్వాగతం పలికారు.
సౌదీ అరేబియాలోని బెహరిన్ విమానాశ్రయం నుంచి ఈ ప్రత్యేక విమానం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది. భారతీయ విమానాశ్రయ అధికారులు ప్రత్యేక విమానంలో వచ్చిన వారికి,అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించారు.అతి త్వరలో అంతర్జాతీయ విమానాలను తిరుపతి విమానాశ్రయంలో ప్రయాణికులతో ప్రారంభిస్తామని ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. అయితే కొందరు విదేశాల నుంచి నేరుగా తిరుపతికి వచ్చేందుకు విమాన సౌకర్యం లేదు.. వారు హైదరాబాద్, విజయవాడ వెళ్లి అక్కడి నుంచి మళ్లీ తిరుపతికి వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని తిరుపతి ఎయిర్‌పోర్టుకు నడిపితే ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సర్వీసులు నడపాలని కోరుతున్నారు.