ప్రపంచంలో ఎక్కడికెళ్లినా సరే ప్రజలు పట్టణాల్లో నివసించేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఇక యువత సంగతి అయితే చెప్పనక్కర్లేదు. పల్లెటూళ్లో పుట్టిన పెరిగిన అమ్మాయిలు సైతం.. పెద్ద పెద్ద నగరాల్లో ఉద్యోగాలు చూసే యువకులను పెళ్లాడేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు పెళ్లి సంబంధాలు రావడం కష్టం అవుతోంది. మన దగ్గరే పరిస్థితి ఇలా ఉంటే.. జనాభా వృద్ధిరేటు మైనస్‌లో ఉంటున్న జపాన్‌లో ఇంకెలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పనక్కర్లేదు.
దీంతో రాజధాని టోక్యోలో నివసించే ఒంటరి మహిళలను పల్లె బాట పట్టించేందుకు.. వారికి ఆర్థిక ప్రోత్సాహకం అందించేలా జపాన్ ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. జపాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల సంఖ్య వేగంగా తగ్గుముఖం పడుతోంది. పల్లె ప్రాంతాల్లో యువకులతో పోలిస్తే యువతుల సంఖ్య తక్కువగా ఉంటోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం కష్టమవుతోంది.
2020 నాటి జపాన్ జనాభా లెక్కల ప్రకారం టోక్యో నగరం కాకుండా.. జపాన్‌లోని మిగతా ప్రాంతాల్లో 11.1 మంది పెళ్లి కాని లేదా ఒంటరి పురుషులు ఉండగా.. మహిళలు మాత్రం 20 శాతం తక్కువగా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లోనైతే ఈ గ్యాప్ దాదాపు 30 శాతంగా ఉంది. అంటే వందలో 30 మంది యువకులకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాల్సిన పరిస్థితి.
దీంతో జపాన్ ప్రభుత్వం టోక్యో నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్న ఒంటరి మహిళలకు ఛార్జీలు, ఇతరత్రా ప్రోత్సాహకాల రూపంలో 6 లక్షల యెన్‌లు, మన కరెన్సీలో రూ.3.45 లక్షలు ఇవ్వాలని భావించింది. కానీ ఈ నిర్ణయంపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. ఈ ప్లాన్‌ను సమీక్షించాలని జపాన్ సహాయక మంత్రి హనకో జిమీ ఆదేశించారు. ఇప్పటికే అమ్మాయిలకు డబ్బులిచ్చారని వచ్చిన వార్తలు నిజం కాదని ఆమె స్పష్టం చేశారు.
‘‘నగరంలో నివసించే.. చదువుకున్న, స్వతంత్ర మహిళలు ఎవరైనా ఈ ప్లాన్ పట్ల ఆకర్షితులవుతారని ప్రభుత్వం అనుకుంటుందా..? నేను ఒక లోకల్ అబ్బాయిని పెళ్లి చేసుకొని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడితే నాకు 6 లక్షల యెన్‌లు వస్తాయి. కానీ నేనలా చేస్తానా..? వాళ్లు (ప్రభుత్వం) నిజంగానే సీరియస్‌గానే ఉందా?’’ అని ఒకమ్మాయి ట్విటర్లో కడిగేసింది.
ఆడపిల్లలంటే ఆటబొమ్మలనుకుంటున్నారా..? పిల్లలను కనడమే వాళ్ల పనా..? అంటూ మరో నెటిజన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అసలు సమస్య మూలాలను పట్టించుకోకుండా.. ఈ ప్రోత్సాహకాలతో ఒరిగేదేముందని జపాన్ ప్రధాని సలహాదారే వ్యాఖ్యానించారు. దీంతో ప్రస్తుతానికైతే జపాన్ ప్రభుత్వం తన ప్లాన్‌ను నిలిపేసింది. మరీ కామెడీ కాకపోతే.. 6 లక్షల యెన్‌లకు ఆశపడి.. ఎవరైనా సిటీ లైఫ్‌ను, అక్కడుండే సదుపాయాలను వదులుకొని గ్రామీణ ప్రాంతాలకు వెళ్తారా..? అది కూడా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు..!
అయితే జపాన్ ప్రభుత్వం మాత్రం జనాభా తగ్గుదల సమస్యను సీరియస్‌గానే తీసుకుంటోంది. ఈ ఏడాది జూన్‌లో ఓ డేటింగ్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. వరుసగా ఎనిమిదో ఏడాది జపాన్‌లో జననాల సంఖ్య తగ్గింది. గతేడాది జపాన్‌లో 758,631 మంది పిల్లలు పుట్టగా.. అంతకు రెండింతల మంది చనిపోయారు. 2022లో జపాన్‌లో 9 లక్షల మంది పిల్లలు పుట్టారు. అంతకు ముందు దశాబ్దంతో పోలిస్తే ఇది 15.2 శాతం తక్కువ.
పెళ్లిళ్ల రేటు తగ్గడం.. అంతకు మించి జననాల రేటు తగ్గడం పట్ల జపాన్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2070 నాటికి జపాన్ జనాభా 30 శాతం తగ్గి 87 మిలియన్లకు పడిపోతుందని అంచనా. అప్పుడు ప్రతి పది మంది జపనీయుల్లో నలుగురు 65 ఏళ్లు పైబడిన వారే ఉంటారని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్ అంచనా వేసింది.