తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు. తాకిడి కొనసాగుతోంది. ఆదివారం 74,498 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,355 మంది తలనీలాలు సమర్పించారు.తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.06 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది గంటల సమయం పట్టింది.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం తిరుమల ముస్తాబవుతోంది. లక్షలాది మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి తిరుమలకు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగనున్నాయి. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమౌతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి.
4వ తేదీన సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణం చేస్తారు శ్రీవారి అర్చకులు. రాత్రి 9 గంటలకు శ్రీమలయప్ప స్వామివారిని పెద శేష వాహనంపై ఊరేగిస్తారు. 5న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.బ్రహ్మోత్సవాల్లో గరుడసేవకు ఎంతో ప్రత్యేకత ఉంది. అక్టోబర్ 8వ తేదీన గరుడసేవ. ఆ రోజున గరుడవాహనారూఢుడై దర్శనం ఇస్తారు శ్రీవారు. భక్తులను కరుణిస్తారు. ఆ రోజున తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య.. మిగిలిన బ్రహ్మోత్సవ రోజుల కంటే అధికంగా ఉండటం ఆనవాయితీగా వస్తోంది.
భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. గరుడసేవ రోజైన అక్టోబరు 8వ తేదీన రెండు ఘాట్ రోడ్‌లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించింది టీటీడీ. అక్టోబర్ 7వ తేదీన రాత్రి 9 గంటల నుంచి 9వ తేదీ ఉదయం తెల్లవారు జామున 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగించడానికి అనుమతించరు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.