పెరుగుతున్న సవాళ్ల కారణంగా సాయుధ బలగాలు అప్రమత్తంగా ఉండాలని, శాంతిని కాపాడాలంటే వారు యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్, బంగ్లాదేశ్‌లోని పరిస్థితులను ఉదహరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీ రాజధాని లక్నోలో జరిగిన త్రివిధ దళాల జాయింట్ కమాండర్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ... భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసుకోవడంతో పాటు ఊహించని పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. భారత్ ప్రపంచ శాంతిని కోరుకునే దేశమని వ్యాఖ్యానించారు.దీనిని కాపాడుకోవడానికి సాయుధ బలగాలు యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. శాంతి, స్థిరత్వానికి ఉత్తర సరిహద్దు, పొరుగు దేశాల్లో నెలకొన్న పరిస్థితులు సవాల్ విసురుతున్నాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని సైన్యాధికారులు విస్తృత, లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.