విజయవాడను వరుణుడు భయపెడుతున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు విజయవాడను ముంచెత్తిన సంగతి తెలిసిందే. పదుల సంఖ్యలో ప్రాణాలను, భారీగా ఆస్తి, పంట నష్టాన్ని కలిగించిన ఈ వరదల విలయం నుంచి ఇప్పుడిప్పుడే బెజవాడ కోలుకుంటోంది. అయితే ఇంతలోనే విజయవాడలో మరోసారి భారీ వర్షం కురిసింది. శనివారం మధ్యాహ్నం సమయంలో విజయవాడలో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రభుత్వ సిబ్బంది చేపడుతున్న సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. వరద ప్రభావిత ప్రాంతాల వాసులకు ఆహారం, మంచినీటి సరఫరాతో పాటుగా నిత్యావసరాలను సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. ఇదే సమయంలో ఇళ్లల్లో పేరుకున్న బురదను క్లీన్ చేయటంతో పాటుగా వీధుల్లో ఉన్న బురదను మున్సిపల్ సిబ్బంది ఫైరింజన్ల సాయంతో శుభ్రం చేస్తున్నారు. వర్షం కారణంగా ఈ సహాయక చర్యలకు విఘాతం కలిగింది.
మరోవైపు శుక్రవారం రాత్రి ఎగువ ప్రాంతాల్లో్ కురిసిన వర్షానికి విజయవాడ వాసులను మరోసారి వరద భయం వెంటాడింది. విద్యాధరపురం, భవానీపురం, సింగ్ నగర్, జక్కంపూడి కాలనీ, రాయనపాడు గ్రామాల్లోకి వరద ప్రవాహం పెరిగింది. దీంతో స్థానికులు, అధికారులు ఆందోళన చెందారు. మొన్నటి ఘటనతో భయపడిపోయిన స్థానికులు మరోసారి వరద భయంతో ఆందోళన చెందారు. అయితే వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ వద్ద వరద లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు బుడమేరు వాగుకు పడిన మూడు గండ్లను అధికారులు పూడ్చివేశారు. జలవనరుల శాఖ అధికారులు.. ఆర్మీ సాయంతో మూడో గండిని శనివారం పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం నిలిచిపోయింది. దిగువ ప్రాంతాల వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అటు కృష్ణాజిల్లాలోనూ బుడమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కొన్ని మండలాల్లో బుడమేరు వాగుకు వరద ప్రవాహం తగ్గినప్పటికీ.. మండవల్లి, గుడివాడ, నందివాడలో మాత్రం బుడమేరు వాగుకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో పంటపొలాలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నేతృత్వంలో టీడీపీ శ్రేణులు సహాయక చర్యలు చేపడుతున్నాయి.