ఏపీలో వరద నష్టం గురించి ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో రూ.6,882 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్రానికి సమర్పించేందుకు ప్రాథమిక నివేదిక కూడా సిద్ధం చేసింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. భారీ వర్షాలు, వరదలతో అత్యధికంగా రోడ్లు, భవనాలశాఖకు రూ.2,164.5 కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చింది. అలాగే నీటివనరుల శాఖకు రూ.1568.5 కోట్లు నష్టం జరిగినట్లు గుర్తించారు. ఇక పురపాలకశాఖకు రూ.1,160 కోట్లు, రెవెన్యూశాఖకు రూ.750 కోట్లు చొప్పున నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపీ విద్యుత్‌శాఖకు రూ.481 కోట్లు, వ్యవసాయశాఖకు రూ.301 కోట్ల చొప్పున నష్టం జరిగింది. మరోవైపు పంచాయతీ రోడ్లకు రూ.167.5 కోట్లు, మత్స్యశాఖకు రూ.157.86 కోట్లు నష్టం జరిగింది. ఇక వరదలతో గ్రామీణ నీటిసరఫరాకు రూ.75.5 కోట్లు, ఉద్యానశాఖకు 39.9 కోట్లు, పశుసంవర్థకశాఖకు రూ.11.5 కోట్ల చొప్పున, అగ్నిమాపకశాఖకు రూ.2 కోట్ల చొప్పున నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మేరకు శాఖల వారీగా నివేదిక సిద్ధం చేసిన అధికారులు.. కేంద్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఈ నివేదిక ఆధారంగానే కేంద్రం ఏపీకి వరద సాయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు ఏపీ, తెలంగాణకు కలిపి తక్షణ సాయం కింద రూ.3,300 కోట్లు కేంద్రం విడుదల చేసిందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. వరదలతో ప్రభావితమైన రెండు రాష్ట్రాలకు కలిపి కేంద్రం రూ.3,300 కోట్లు విడుదల చేసిందంటూ కథనాలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వరద నష్టం గురించి కేంద్రానికి ఇంకా నివేదికలే పంపలేదని అన్నారు. వరద సాయం విడుదల చేసినట్లు తమకేమీ సమాచారం లేదని వెల్లడించారు. తాజాగా వరద నష్టంపై నివేదిక సిద్ధం చేసిన నేపథ్యంలో.. ఈ నివేదికల ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. అలాగే కేంద్ర బృందం, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఏపీలో పర్యటించారు, వరద నష్టాన్ని పరిశీలించారు. వీరి నివేదికల ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.