విజయవాడను వరద వణికించింది.. నగరంలోని పెద్ద, పెద్ద భవనాలను సైతం వరద నీళ్లు ముంచెత్తాయి. విజయవాడ వరద ప్రాంతాల్లో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్ల సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందించేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ కొత్తగా యాప్ తీసుకొస్తోంది. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ సేవలందించేందుకు ఆసక్తి ఉన్నవారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ పొందిన 4,036 మందిలో 462 మంది ముందుకొచ్చారు.
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ రెండు, మూడు రోజుల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. వరద ప్రాంతాల్లో ఎక్కువమంది పనిచేసేందుకు ఆసక్తి చూపించేలా కనీస మొత్తం ఇవ్వడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంతేకాదు ప్రధానంగా గ్యాస్‌స్టవ్‌ల మెకానిక్‌ల లభ్యతపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. విజయవాడను ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో ఇళ్లలోని ఫ్రిజ్‌లు, టీవీలు, గ్యాస్ స్టవ్‌లు, ఇతర వస్తువులు నీటిలో మునిగాయి. వీటిలో అవకాశం ఉన్నవాటిని రిపేర్ చేసే దిశగా ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది.
మరోవైపు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికీ మూడురోజుల్లోగా నిత్యావసరాల కిట్లను అందజేస్తామంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, చక్కెర, లీటరు పామాయిల్, రెండు చొప్పున బంగాళాదుంపలు, ఉల్లిపాయల్ని ఒక కిట్‌గా అందజేస్తున్నారు. అంతేకాదు 6 ఇన్‌స్టెంట్ నూడుల్స్ ప్యాకెట్లు, ఆరు యాపిల్స్, ఆరు బిస్కట్ ప్యాకెట్లు, లీటర్ వాటర్ బాటిళ్లు ఆరు, నాలుగు (అర లీటరు) పాల ప్యాకెట్లు కలిపి మరో కిట్‌గా పంపిణీ చేస్తున్నారు. ఆ రెండు కిట్లు ప్రజలకు అందే వరకు.. వండిన ఆహార పదార్థాలను బాధితులకు అందజేస్తామంటున్నారు. మొదటి రోజు (శుక్రవారం) 80 వేల కుటుంబాలకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. కొన్ని ఇబ్బందుల వల్ల 15 వేల కుటుంబాలకు మాత్రమే ఇవ్వగలిగామన్నారు. ఇవాళ మరో 40-45 వేల కుటుంబాలకు అందజేస్తామన్నారు. ఆ తర్వాత మిగిలినవి ఆదివారం నుంచి రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తామన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు, వైద్య సహాయం, మందుల సరఫరా వంటి కార్యక్రమాలు కొనసాగుతాయంటున్నారు.
విజయవాడ వరదల్లో ఇళ్లు దెబ్బతిన్నవారు, వ్యాపారాల్లో నష్టపోయినవారి కోసం ఏం చేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రభుత్వం తరఫున ఎంత సాయం చేయాలి.. వారికి రుణాలు ఇప్పించి, తిరిగి చెల్లించే గడువు ఎక్కువ రోజులు ఉండేలా చూడగలమా అన్న అంశాలపై కసరత్తు చేస్తున్నారు. రుణాల రీషెడ్యూల్‌పై బ్యాంకర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇటు బుడమేరు, కృష్ణా వరదల్లో ముంపునకు గురైన ప్రాంతాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాప్టర్ నుంచి పరిశీలించారు.