ఇటీవల వరదల నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నుంచి రూ. 9.45 కోట్ల వరకు విరాళాన్ని అందించారు. తాజాగా మెగా డాటర్ నిహారిక వ్యక్తిగతంగా ఏపీలో వరద బాధితులకు రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. బుడమేరు నది వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పది గ్రామాలపై నిహారిక దృష్టి కేంద్రీకరించారు. నిహారిక ఆర్థిక విరాళాన్ని ప్రకటిస్తూ... "బుడమేరు వాగు ముంపుతో విజయవాడ రూరల్ ఏరియాలో అనేక గ్రామాలు నీట మునగడం, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండడం నాకు చాలా బాధ కలిగించింది. ఇటువంటి ప్రకృతి విపత్తులో ఎక్కువగా ఇబ్బందులు పడేది గ్రామీణ ప్రాంత ప్రజలే. నేను పుట్టి పెరిగిన వాతావరణం అంతా నగరంలోనే అయినా మా పెద్దవారు అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే కాబట్టి వారి చెప్పే అనుభవాలు విన్న దృష్ట్యా నాకు గ్రామీణ వాతావరణంపై ఎంతో అభిమానం ఉంది. ఉప ముఖ్యమంత్రి అయిన మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారితో పాటు మా కుటుంబీకులు అందరూ బాధితులకు అండగా నిలబడడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. నేను కూడా ఈ బృహత్కార్యంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఉడతా భక్తిగా వరద ముంపునకు గురైన పది గ్రామాలకు ఒక్కో గ్రామానికి ఏభై వేలు చొప్పున ఐదు లక్షలు రూపాయలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను" అని అన్నారు.