ఆంధ్రప్రదేశ్‌లోని క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త. ఇప్పటి వరకూ క్రికెట్ మ్యాచ్‌లంటే మన దగ్గరలో హైదరాబాద్ లేదా విశాఖలో జరిగేవి. అయితే క్రికెట్ మ్యాచ్‌లను మంగళగిరి, కడపలోనూ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. మంగళగిరిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రూపుదిద్దుకుంటోంది. దీనితో పాటుగా కడపలో మ్యాచ్‌లు జరిగేలా చూస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు కేశినేని చిన్ని వెల్లడించారు. ఏసీఏ ప్రెసిడెంట్‌గా విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన కేశినేని చిన్ని.. అన్ని ప్రాంతాల్లో నైపుణ్యం గల ఆటగాళ్లను ప్రోత్సహిస్తామన్నారు. అలాగే మంగళగిరి, కడపలో కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ఏసీఏ అధ్యక్షుడిగా వరద బాధితుల కోసం కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు తొలి నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు ఏపీలో ప్రభుత్వం మారటంతో ఏసీఏ కమిటీ కూడా మారిపోయింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్‌లోని ఆరు పదవులకు ఆగస్టులో నామినేషన్లు స్వీకరించారు.అయితే ఆరు స్థానాలకు ఆరు నామినేషన్లు మాత్రమే దాఖలు చేశారు. ఒక్కో పదవికి ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావటంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే సెప్టెంబర్లో ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉండేది. ఈ నేపథ్యంలో అప్పట్లో ఫలితాలను వెల్లడించలేదు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో నూతన అధ్యక్షుడు, కార్యవర్గం ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఏసీఏ జనరల్ మీటింగులో ప్రెసిడెంట్‌గా ఎంపీ కేశినేని శివనాథ్ ప్యానెల్ ఎన్నికైనట్లు ఆర్వో నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు.
ఇక ఏసీఏ ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు, ట్రెజరర్‌గా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌గా గౌరు విష్ణుతేజ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగానే విశాఖతో పాటుగా మంగళగిరి, కడపలోనూ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగేలా చూస్తామని కేశినేని చిన్ని తెలిపారు. మరోవైపు మంగళగిరిలో నిర్మిస్తున్న అంతర్జాతీయ స్టేడియాన్ని ఆరు నెలల్లో ప్రారంభించేందుకు ఏసీఏ చర్యలు తీసుకుంటోంది. 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంగళగిరి స్టేడియానికి శంకుస్థాపన చేశారు. 2009లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 24 ఎకరాల్లో స్టేడియం నిర్మించాలని సంకల్పించారు. అయితే నిధుల కొరతతో స్టేడియం నిర్మాణం నత్తనడకన సాగుతోంది.