ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, విజయవాడలో వరదలు పోటెత్తిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడలో ప్రాణనష్టంతో పాటుగా భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. వరదలలో వాహనాలు, ఇళ్లు, దుకాణాలతో పాటు చిన్న, మధ్యతరహా వ్యాపార సముదాయాలు వంటివి దెబ్బతిన్నాయి. అయితే ఇలా వరదలో నష్టపోయిన ఆస్తులకు సంబంధించిన బీమా క్లెయిమ్‌లను త్వరగా పరిష్కరించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలతో జరిగిన సమావేశంలో సూచించారు. ఈ నేపథ్యంలో ఈ బీమా క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు సీఎం మార్గదర్శకాలను అనుగుణంగా ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రేపు ( సెప్టెంబర్ 9) నుంచి ఈ కేంద్రం ద్వారా సేవలు పొందవచ్చని..కలెక్టర్ సృజన తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
మరోవైపు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఈ ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లెయిమ్‌లు నమోదు చేయడం సహా అసెస్‌మెంట్ కోసం సర్వేయర్ నియామకం, క్లెయిమ్ ఫారాల సమర్పణ, అక్కడే క్లెయిమ్‌ల పరిష్కారం జరుగుతుందని అధికారులు తెలిపారు. అలాగే క్లెయిమ్‌ల పరిష్కారం విషయంలో ఫాలో అప్‌ల కోసం కూడా ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ప్రకటనలో వెల్లడించారు. ఈ కేంద్రంలో బీమా కంపెనీల ప్రతినిధులు అందుబాటులో ఉంటారని.. బాధితులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఈ సేవలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
మరోవైపు ఈ ఫెసిలిటేషన్ కేంద్ంలో చోళ ఎం ఎస్, బజాజ్ అలియాంజ్, ఇఫ్కో - టోకియో, జ్యూరిచ్ కోటాక్, రాయల్ సుందరం, ఐసీఐసీఐ లాంబార్డ్, టాటా - ఏఐజీ, లిబర్టీ, మాగ్మా హెచ్ డీ ఐ, శ్రీరామ్, నేషనల్ ఇన్సూరెన్స్, ది ఓరియంటల్, నవీ, న్యూ ఇండియా, గో డిజిట్, యునైటెడ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ ఏర్గో, యూనివర్సల్ సోంపో, ఎస్బీఐ, జూనో, రిలయెన్స్, ఏసీకేవో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు అందుబాటులో ఉంటారు. ముంపు ప్రాంతాలకు చెందిన బాధితులు క్లెయిమ్ ల పరిష్కారం కోసం వీరిని సంప్రదించవచ్చు. మరోవైపు వెంటనే క్లెయిమ్ నమోదు చేసుకునేందుకు బీమా కంపెనీలను వాట్సాప్, టోల్‌ఫ్రీ నంబరు, ఈ-మెయిల్, వెబ్‌సైట్ లేదా ఇతర మార్గాల ద్వారా కూడా సంప్రదించవచ్చని కలెక్టర్ సూచించారు.