బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది తీవ్రవాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే వచ్చే రెండు రోజులు కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా సోమవారం కొన్ని జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నడుమ.. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నందున సోమవారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు.
మరోవైపు.. వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. సోమవారం కూడా భారీ వానలు పడే అవకాశం ఉందన్న అంచనాల మధ్య విజయనగరం జిల్లాలో కూడా సోమవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. సోమవారం జిల్లాలోని స్కూళ్ళు, కళాశాలలు, విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. వీటితో పాటుగా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించే కార్యక్రమం.. ప్రజా వినతుల స్వీకరణను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రద్దు చేశారు. మరోవైపు ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాలలోనూ భారీ వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా సెలవు ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
మరోవైపు వాయుగుండం కారణంగా సోమవారం ఏలూరు, అల్లూరి, ఉభయగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్.. శ్రీకాకుళం, మన్యం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు వాతావరణశాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది.