వినాయక చవితి పండుగ నేపథ్యంలో విగ్రహాలు, మండపాలు ఏర్పాటు అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సింగిల్ విండో విధానంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, దీనిపై టాలీవుడ్ నటి, బీజేపీ యువ నాయకురాలు మాధవీలత తీవ్ర స్థాయిలో స్పందించారు. అందరికీ హిందువుల పండుగ మీద చిల్లర ఏరుకోవడమే పని అన్న ఆమె.. అడుక్కుంటే భిక్షం వేయడానికి వినాయక భక్తులు సిద్ధంగా ఉంటారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇదే సమయంలో హోం మంత్రి వంగలపూడి అనితపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన చిన్నారి హత్యాచార ఘటన సహా పలు సంఘటనలపై ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
‘‘ఆంధ్ర హిందూ బంధువులు ముఖ్యంగా వినాయక భక్తులు అడుక్కుంటే భిక్షం వేయడానికి సిద్దంగా ఉంటారు , అసలే మా గణేశుడికి ఆకలి ఎక్కువ ఆయన కోసం వండే వాటిని తగ్గించి మీకు నాలుగు ముఖాన వేస్తారు ఏముంది.. అందరికీ మా పండగల మీద చిల్లర ఏరుకోవడమే పని.. సమాన న్యాయం.. సమాన ధర్మ పెట్టండి అన్ని మతాలు సమానం.. అన్ని పండగలు సమానం.. అందరూ సమానం.. మరి మా మైక్ సెట్‌కి, మా గణేశ మండపాలకి.. మా గణేష్ ఎత్తుకి డబ్బులెందుకో??????’ అని ప్రశ్నించారు.
అనితక్క??? ఏంది మీ తిక్క …… ఔనక్కా మొన్న చిన్నపిల్లని మానభంగం చేసి చంపేశారు ఏమైంది కేసు??.. ముసలోడు ఉయ్యాల్లో బిడ్డని మానభంగం చేశాడు.. ముసలోడికి ఉరిశిక్ష వేయలేదా?.. ఓహో ఇపుడు మేమిచ్చే భిక్షతో లాయర్స్ని పెడతారా? శిక్షల కోసం …’ అని హోం మంత్రి అనితపై పరోక్షంగా విమర్శలు చేశారు.
కాగా, .గణేశ్ మండపాల మైక్ పర్మిషన్‌కు, విగ్రహం హైట్‌ను బట్టి చలాన్లు కట్టాల్సి ఉంటుందని హోం మంత్రి అనిత చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. మైక్ పర్మిషన్‌కు రోజుకు రూ.100, ఎకో ఫ్రెండ్లీ అంటే మట్టి విగ్రహం 3-6 అడుగులుంటే రూ.350, ఆరు అడుగుల పైన ఉంటే రోజుకు రూ.700 చలానా కట్టాలి అని ఆమె అన్నారు.