వరదలు ముంచెత్తి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు సాయం అందడం లేదని, అసలు ఇదంతా ఎందుకు జరిగిందో చెబుతూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ పోస్ట్‌పై సినీ నటుడు బ్రహ్మాజీ స్పందించారు. తనదైన శైలిలో జగన్ ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘‘మీరు కరెక్ట్ సార్ .. వాళ్లు చెయ్యలేరు.. ఇక నుంచి మనం చేద్దాం.. ఫస్ట్ మనం రూ.1000 కోట్లు విడుదల చేద్దాం.. మన వైసీపీ క్యాడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం.. మనకి జనాలు ముఖ్యం.. ప్రభుత్వం కాదు. మనం చేసి చూపిద్దాం సార్.. జై జగన్ అన్నా’’ అంటూ కామెంట్ పెట్టారు.
అయితే, కొద్దిసేపటికే ఈ ట్వీట్ వైరల్ కాగా.. ఆయన దానిని తొలగించారు. అంతేకాదు, తాను వైసీపీకి వ్యతిరేకంగా ట్వీట్ చేయలేదని.. ఎవరో తన ఎక్స్ అకౌంట్‌ను హ్యాక్ చేశారని అన్నారు. పోలీసులకు కూడా దీనిపై ఫిర్యాదు చేసినట్టు మరో ట్వీట్ చేశారు. కానీ, వైఎస్ఆర్సీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే ఆయన దీనిని తొలగించినట్టు తెలుస్తోంది. జగన్ అభిమానులు ఆయనపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను పలువురు షేర్ చేస్తున్నారు.
ఇక, భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలను ముంచేశాయి. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. గత 8 రోజులుగా సీఎం చంద్రబాబు దగ్గరి నుంచి మంత్రులు, అధికార యంత్రాంగం, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహా ప్రతి ఒక్కరూ సహాయక చర్యల్లో తీరికలేకుండా పాల్గొంటున్నారు. మరోవైపు, వరద ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. శనివారం కూడా అందరికీ ఆహారం, మంచినీరు ప్రభుత్వం అందించింది. ఇంటింటికీ వెళ్లి బాధితులకు నిత్యావసర సరకుల కిట్ పంపిణీ చేస్తున్నారు.
ఎవరికైనా అందకపోతే డిమాండ్ చేసి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాయితీపై 64 టన్నుల కూరగాయలు విక్రయించినట్లు సీఎం తెలిపారు. వరద ప్రాంతాల్లోని రోడ్లను 78 శాతం శుభ్రం చేసినట్టు సీఎం చెప్పారు. మొత్తం 1.40లక్షల ఇళ్లలో సామాన్లు పాడైపోయాయని అన్నారు.