అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలిద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాల్ రెండు రోజుల పర్యన కోసం ఆదివారం భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్ హౌస్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపినట్టు సమాచారం. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతంపై దృష్టిసారించారు. ఇక అబుదాబి యువరాజు భారత్‌కు రావడం ఇదే తొలిసారి. దీంతో ఆయన పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఆయన పర్యటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్ (ట్విట్టర్) స్పందిస్తూ.. "భారత్, యూఏఈ మధ్య రాజకీయ, పెట్టుబడి, సాంకేతికత, విద్య, వాణిజ్యం, ఇంధనంతో పాటు వివిధ రంగాలలో మంచి సహకారం ఉందని పేర్కొంది. ఇరు దేశాలు చారిత్రాత్మక సన్నిహిత సంబంధాలను కొనసాగించడం జరుగుతుంది" అని తెలిపింది. ఇక మోదీతో క్రౌన్ ప్రిన్స్ సమావేశంలో కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, పీయూష్ గోయెల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా యువరాజు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా భేటీ అవుతారు. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మంగళవారం జరిగే బిజినెస్ ఫోరం సదస్సులో కూడా ఆయన పాల్గొననున్నారు.