ఉమ్మడి విజయనగరం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ప్రజలను వైయస్ఆర్‌సీపీ నాయకుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. గత 24 గంటలుగా పలు ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిసాయనీ, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఫలితంగా రానున్న మూడు రోజులు పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ప్రజలకు ఒక ప్రకటన ద్వారా పలు సూచనలు చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, నదులు, రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి, అధికార యంత్రాంగానికి తమ సహాయ సహకారాలను అందించాలని, వారి సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. కొన్ని మండలాల్లో గత 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యిందని, అటువంటి చోట పంటలు దెబ్బ తినకుండా ఉండేందుకు, పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా రైతులు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. వంతెనలు, కాజ్ వేల పై నుంచి నీరు ప్రవహిస్తున్నప్పుడు వాటిపైనుంచి ప్రయాణించవద్దని, తగ్గేవరకు వేచి ఉండాలని కోరారు. వర్షాల కారణంగా నీరు కూడా కలుషితం అయ్యే అవకాశం ఉందని, వీలైనంత వరకు సురక్షిత త్రాగునీరు, కాచి చల్లార్చిన నీరు తీసుకోవాలని సూచించారు. వర్షాలవల్ల రోడ్లపై గుంతలు పడే అవకాశం, అంచులు కోసుకుపోయే అవకాశం ఉందని, వాహనదారులు వాహనాన్ని నడిపేటప్పుడు వీటిని గమనించాలని సూచించారు. అలాగే పశు సంపదకు నష్టం వాటిల్లకుండా, పాడి పశువులు, మూగ జీవాలకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేసేటప్పుడు, వీలైనంత ముందుగానే దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా తగిన పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని, సురక్షిత తాగునీటిని అందించాలని అధికారులకు సూచించారు. పంటలు నష్టపోకుండా వ్యవసాయ శాఖాధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రమాద నివారణా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాపరిషత్ పరంగా ఎప్పటికప్పుడు రెండు జిల్లాల్లోని పరిస్థితిని పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పలు సూచనలు చేస్తున్నామని జెడ్పీ చైర్మెన్ శ్రీనివాసరావు తెలిపారు.