ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో అసలు శాంతి భధ్రతలు ఉన్నాయా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 11, 2024, 09:49 AM

పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేపై నంబూరి శంకరరావుపై  మంగళవారం జరిగిన దాడి దుర్మార్గమని  మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో యథేచ్ఛగా అధికార పార్టీ దురాగతం సాగుతోందని ఆక్షేపించారు. రాష్ట్రంలో అసలు శాంతి భధ్రతలు ఉన్నాయా? అని గట్టిగా నిలదీశారు. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలన్న చంద్రబాబు, విజయవాడ వరదల సంక్షోభంతోవైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై కక్ష తీర్చుకోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి అన్నారు. ప్రకాశం బ్యారేజ్‌ను మూడు పడవలు ఢీకొట్టడంతో బ్యారేజ్‌ కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడిందని, దీనికి వైయ‌స్ఆర్‌సీపీ కారణం అని, ఇది ఒక కుట్ర అని చంద్రబాబు, మంత్రులంతా చెప్పడం, దానికి ఎల్లో మీడియా వంత పాడడం దారుణమని ఆయన ఆక్షేపించారు. తమ పార్టీ నేతలపై కేసులు పెట్టాలన్న లక్ష్యంగానే ఇదంతా జరుగుతోందన్న ఆయన, నిజానికి ప్రకాశం బ్యారేజ్‌ను కేవలం ఆ మూడు పడవలే కాకుండా, ఇంకా చాలా బోట్లు  ఢీకొట్టాయని వెల్లడించారు. దాదాపు 11.43 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఈ మధ్యకాలంలో ఎన్నడూ రాలేదని, ఆ వరద ఉధృతికి పైనుంచి అనేక పడవలు కొట్టుకొచ్చాయని, వాటిలో టూరిజమ్‌ బోట్లు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ వరదల వల్ల 202 పడవలు పాక్షికంగా, 432 పడవలు పూర్తిగా దెబ్బతిన్నాయని, కొన్ని వందల చిన్న బోట్లు బ్యారేజ్‌ గేట్ల మధ్య నుంచి కొట్టుకుపోయాయని చెప్పారు. ఈ కేసులో కోమటి రామ్మోహన్, ఉషాద్రిని అరెస్ట్‌ చేశారన్న ఆయన.. కోమటి రామ్మోహన్‌ టీడీపీ ఎన్నారై వింగ్‌ హెడ్‌ కోమటి జయరామ్‌కు సమీప బంధువని, ఉషాద్రి కూడా లోకేష్‌తో ఫోటో దిగారని గుర్తు చేశారు. అయినా ఆ ఘటనను వైయ‌స్ఆర్‌సీపీకి అంటగడుతూ, తమ పార్టీ నాయకులు.. మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ను టార్గెట్‌ చేశారని అంబటి రాంబాబు ఆక్షేపించారు. తాము ప్రకాశం బ్యారేజ్‌ కూల్చే కుట్ర చేశామనడం దుర్మార్గమన్న ఆయన, ఇంత దారుణమైన మాటలు ఎందుకని?. కక్ష సాధింపు ఎందుకని ప్రశ్నించారు. వీటన్నింటికీ చంద్రబాబు సమాధానం చెప్పాలని కోరారు. అధికార పార్టీకి అసెంబ్లీ, లోక్‌సభలో తగిన మెజారిటీ ఉన్నా, ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారని ప్రశ్నించారు.    ‘చంద్రబాబు అంతగా ఎందుకు భయపడుతున్నారంటే.. వైయ‌స్ జగన్‌గారి వెనకున్న 40 శాతం ఓట్లు. ఇంకా కూటమి గెలుపు వారిది కాదన్న భయం. అందుకే జగన్‌గారిని ఏదో ఒక విధంగా అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు’.. అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఏ పడవలకైనా నీలి, పసుపు రంగులే ఉంటాయన్న ఆయన, కావాలంటే ఏ పోర్టుకైనా వెళ్లి చూడాలని హితవు చెప్పారు. విజయవాడను వరద ముంచెత్తడంతో 46 మంది చనిపోయినట్లు చెబుతున్నా, వాస్తవ సంఖ్య ఇంకా చాలా ఎక్కువని, ఆ వివరాలు త్వరలోనే బయటకు వస్తాయని మాజీ మంత్రి తేల్చి చెప్పారు. ఘటన జరిగి 10 రోజులైనా ఇప్పటికీ బాధితులకు సాయం అందడం లేదని, ఇందులో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని స్పష్టం చేశారు. వరద గురించి ముందే తెలిసినా, రెండు లక్షల మందిని తరలించడం సాధ్యం కాదు కాబట్టి, ఊర్కున్నామని రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌ చెప్పారన్న ఆయన, ఈ ఘటనలన్నింటిలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com