ఏలేరుకు పోటెత్తిన వరదతో కాకినాడ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న 62 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏలేరు రిజర్వాయరుకు అత్యంత భారీగా వరద వస్తుండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తుండడంతో ముంపు అధికంగా ఉంది. దీంతో జిల్లాలో ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోని ఏడు మండలాలు నీటమునిగాయి. ఏకంగా 62 గ్రామాల్లో ఇళ్లు నీటమునిగి ప్రజలు విలవిల్లాడుతున్నారు. కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి సమీపంలో ఏలేరు కాల్వకు గండి పడడంతో గ్రామం మొత్తం పీకల్లోతు వరదలో మునిగిపోయింది. ఇళ్లల్లో వస్తువులన్నీ వరదకు కొట్టుకుపోయాయి. ఎలకా్ట్రనిక్ వస్తువులన్నీ బురదలో కూరుకుపోయాయి. దుస్తులు, వంటపాత్రలు సైతం కొట్టుకుపోయాయు. ఇలా అనేక గ్రామాలు వరదతో నీటమునిగాయి. ముంపు గ్రామాల్లో పాడిపశువులు కొట్టుకుపోతాయనే భయంతో చాలామంది పశువులను ఇళ్లలోకి తెచ్చుకుని కాపాడుకుంటున్నారు. విద్యుత్ కోతతో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. మంగళవారం నాటికి వరద మహోగ్రరూపం దాల్చింది. కాలువల సామర్ధ్యం 10 వేల క్యూసెక్కులు కాగా, 32 వేల క్యూసెక్కులకు మించి వరద పారుతుండడంతో ఏడు మండలాల్లో 26 చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో వరద నీరు మొత్తం 45 వేల ఎకరాలకు పైగా ముంచేసింది. జిల్లాలో ఈ ఏడు మండలాల్లో ఎక్కడ చూసినా వరి చేలు నదులను తలపిస్తున్నాయి. వీటిపైన ఆరడుగులకు మించి వరద ప్రవహిస్తుండంంతో నష్టం భారీగా ఉంది.