ఏలేరు వరదతో పిఠాపురం నియోజకవర్గం అతలాకుతలంగా మారింది. గొల్లప్రోలు, ఏలేరు వరదకు సుద్దగడ్డ వరద కూడా తోడవడంతో వరద నష్టం తీవ్రంగా ఉంది. ఈ ఒక్క మండలంలోనే 8,500 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.216 జాతీయ రహదారి వెంబడి చేలన్నీ భారీ నదులను తలపిస్తున్నాయి. ఏలేరు కాలువకు అత్యధికంగా గొల్లప్రోలు మండలంలో 6 చోట్ల గండ్లు పడ్డాయి. పది గ్రామాలు నీటమునిగాయి.పిఠాపురం మండలంలో ఏలేరు కాలువకు 9 చోట్ల గండ్లు పడడంతో 14 వేల ఎకరాల్లో వరి, ఇతర పంటలు మునిగిపోయాయి. వరద నీరు ప్రధాన రహదారులపైకి వచ్చేయడంతో ఏడింటిని మూసేశారు. 15 గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. కిర్లంపూడి మండలంలో ఏలేరు కాలువకు మొత్తం పదిచోట్ల భారీ గండ్లు పడ్డంతో 16వేల ఎకరాల్లో వరి, ఇతర వాణిజ్య పంటలు పూర్తిగా వరదలో మునిగిపోయాయి. కాలువలకు గండ్లు పడ్డంతో మొత్తం 21 గ్రామాల్లో వరద చేరిపోయింది.పిఠాపురం నుంచి గొల్లప్రోలు వెళ్లే దారిలో రాపర్తి నుంచి టోల్‌గేట్ వరకు వరద జాతీయ రహదారిపైకి వచ్చేసింది. ఉదయం మోకాల్లోతులో ఉండే వరద సాయంత్రానికి ఆరు అడుగులకు చేరిపోయి ప్రమాదకరంగా మారింది. దీంతో పోలీసులు ఒకవైపు రాకపోకలను నిలిపివేశారు.గొల్లప్రోలు, పిఠాపురం శివారు ప్రాంతాల్లోని అనేక కాలనీలను మంగళవారం రాత్రి వరద ముంచేయడంతో బాధితులు ఆకలితో అలమటించారు. ఇళ్లలోకి నీరు వచ్చేయడంతో బయటకు వచ్చే మార్గం లేక అటు సాయం చేసేవారు లేక ఇబ్బందులు పడ్డారు.