వరద ముంపు, నష్టంపై బుధవారం సాయంత్రానికి ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఒక్కరిని కూడా వదలకుండా జాగ్రత్తగా చేయాలని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు సహాయ చర్యలపై ఆయన మంగళవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి.. భారీ వర్షాలు, తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ‘మనది తుఫాన్లు అధికంగా ఉండే ప్రాంతం. దానికి అనుగుణంగా సమర్థ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి. కలెక్టర్లు అప్రమత్తత కొనసాగించాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు, వాగులు, వంకలపై పూర్తి అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు. విజయవాడ వీధుల్లో వరద నీరు క్లియర్ అవుతోందని.. పారిశుధ్య పనులు కొనసాగాలని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల పంపిణీ బాగా జరుగుతోందని.. సరుకుల పంపిణీ కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.