అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య మొదటి డిబేట్ వాడీవేడిగా సాగింది. ఏబీసీ న్యూస్ నిర్వహించిన ఈ చర్చలో అబార్షన్, ఆర్దిక సంక్షోభం, హమాస్-ఇజ్రాయేల్ పోరు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై ఇరువురూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇక, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే సంఘర్షణే తలెత్తిది కాదని అన్నారు. ‘మీరు రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధించాలని కోరుకుంటున్నారా?’ అన్న ప్రశ్నకు.. ట్రంప్ నేరుగా సమాధానం ఇవ్వకుండా యుద్ధం ఆగిపోవాలని భావిస్తున్నాని చెప్పారు. ‘ఈ యుద్ధాన్ని ముగించడం అమెరికాకు ఉత్తమమని నేను భావిస్తున్నాను.’ అని పేర్కొన్నారు.
దీనికి కమలా హ్యారిస్ కౌంటర్ ఇస్తూ.. ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీవ్‌లో ఉంటారని . పుతిన్ ఒత్తిడికి ట్రంప్ తలొగ్గి ఉండేవారని ఎద్దేవా చేశారు. ‘పుతిన్ కీవ్‌లో కూర్చుని పోలాండ్‌తో మొదలుపెట్టి యూరప్‌లోని మిగిలిన ప్రాంతాలపై దృష్టి సారిస్తూ ఉంటాడు.. మిమ్మల్ని తినేసే నియంత అని తెలిసినా వారితో స్నేహం చేసిన మీరు ఎంత త్వరగా అభిమానం వదులుకుంటారు’ అని ట్రంప్‌కి కమలా హ్యారిస్ చురకలంటించారు.
ఇక, ఇజ్రాయేల్-హమాస్ యుద్దం గురించి కూడా ఇరువురూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇరు వర్గాలు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కమలా హ్యారిస్ అంటే.. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే పరిస్థితి ఇలా వచ్చేది కాదని ట్రంప్ అన్నారు. ఇజ్రాయేల్‌తో పాటు ఆ ప్రాంతంలోని అరబ్బు పౌరులలంటే హ్యారిస్‌కు ద్వేషమని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కమలా హ్యారిస్.. ట్రంప్ వాదనలు నిజం కాదని, ఇజ్రాయేల్‌కు నా మద్దతు ఉంటుందని నొక్కి చెప్పారు.
‘‘ఇజ్రాయేల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉంది.. కానీ, ఈ యుద్ధం ముగియాలని మేం బలంగా కోరుకుంటున్నాం. ట్రంప్ నియంతలను ఆరాధిస్తారు.. కిమ్ జోంగ్ ఉన్‌కు ఆయన ‘ప్రేమలేఖలు’ రాశారు.. ఆయన తాలిబన్లతోనూ చర్చలు జరిపారు. ప్రపంచ నేతలు ఆయనను చూసి నవ్వుతున్నారు.. నా విదేశీ పర్యటనలో ఇదే అంశం ప్రస్తావనకు వచ్చేదది.. అమెరికా ప్రజలను విభజించేందుకు ఆయన విద్వేషాలను రెచ్చగొడుతున్నారు’ అని కమలా హ్యారిస్ మండిపడ్డారు.
ఇక జో బైడెన్ పాలనలో తుపాకీ సంస్కృతి పెరగడం వల్లే తనపై హత్యాయత్నం జరిగిందని ట్రంప్ ఆరోపించారు. దీనిని కమలా హ్యారిస్ తోసిపుచ్చారు. జులై 13న పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న డొనాల్డ్ ట్రంప్‌పై ఓ యువకుడు కాల్పులు జరపడంతో ఆయన త్రుటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే.