వంద మంది దోషులు తప్పించుకున్నా.. ఓ నిర్దోషికి శిక్ష పడకూడదు.. అన్యాయం జరగకూడదు అనేది న్యాయ మౌలిక సూత్రం. ఆ మౌలిక సూత్రమే అమలు కానప్పుడు బాధ్యులు ఎవరు? ఇలా ఒక వ్యక్తి చేయని నేరానికి ఏకంగా పది సంవత్సరాలు శిక్ష అనుభవించాడు. తాను తప్పు చేయలేదని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఫలితంగా జీవితంలో విలువైన సమయం జైలులో గడిపాడు. కానీ, చివరికి న్యాయమే గెలిచింది. అతడు ఏ తప్పు చేయలేదని నిర్దారణ కావడంతో న్యాయస్థానం విడుదల చేసింది. అయితే, చేయని నేరానికి అన్యాయంగా శిక్షను అనుభవించి, తాను విలువైన జీవితాన్ని కోల్పోయానని కోర్టుకు వెళ్లాడు. అతడి వాదనలను సమర్దించిన కోర్టు పరిహారం చెప్పి కొంత స్వాంతన కలిగించింది. జీవితం జైలు గోడలకు పరిమితమైనందుకు 50 మిలియన్ డాలర్ల (దాదాపు 419 కోట్లు)నష్టపరిహారం చెల్లించాలని అమెరికాలోని చికాగో ఫెడరల్ జ్యూరీ కోర్టు ఆదేశించింది. ఇంత పెద్ద మొత్తంలో జ్యూరీ పరిహారం చెప్పడం అమెరికా చరిత్రలోనే ఇదే మొదటిసారి.
కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. 2008లో 19 ఏళ్ల యువకుడ్ని హత్య చేశాడన్న ఆరోపణలపై ఇల్లినాయిస్‌కు చెందిన మార్సెల్ బ్రౌన్ (34) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం.. పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాల ఆధారంగా అతడిని దోషిగా నిర్ధారించింది. అతడికి ఈ కేసులో 35 ఏళ్ల జైలు శిక్ష ఖరారుచేసింది. కానీ, బ్రౌన్‌తో బలవంతంగా నేరం ఒప్పుకునేలా చేశారని పేర్కొంటూ 2018లో అతడి తరఫున న్యాయవాదులు తీర్పును సవాల్ చేశారు. ఇందుకు సంబంధించిందిన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు.
దీంతో అతడిపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేస్తూ బ్రౌన్‌ను నిర్దోషిగా విడుదల చేసింది. అయితే, తనను తప్పుడు కేసులో ఇరికించి జైల్లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ బ్రౌన్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన చికాగో ఫెడరల్ కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ‘‘తప్పుడు కేసులో బ్రౌన్‌ను అరెస్టు చేసినందుకు 10 మిలియన్ డాలర్లు, పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించేలా చేసినందుకు మరో 40 మిలియన్ డాలర్లు కలిసి మొత్తం 50 మిలియన్ డాలర్లు చెల్లించాలి’ అని ఆదేశించింది.
అంటే దీని విలువ భారత కరెన్సీలో దాదాపు రూ.419కోట్లకు పైమాటే. కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన బాధితుడు... ఇన్నాళ్లకు తనకు, తన కుటుంబానికి న్యాయం జరిగిందని అన్నారు. ‘‘చికాగో పోలీస్ అధికారులు తనను ఇంటరాగేషన్ రూమ్‌లో 30 గంటలకుపైగా బంధించారు.. కనీసం భోజనం కూడా పెట్టకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు.. ఫోన్ చేసుకుంటానని ప్రాధేయపడినా అనుమతించలేదు.. నిద్రకూడా పోనివ్వలేదు’’ అని బ్రౌన్ ఆ నాటి సంఘటనను గుర్తుచేసుకున్నాడు. కాగా, గతంలోనూ ఇటువంటి సంఘటనలు జరిగాయి.
ఫ్లోరిడాకు చెందిన రాబర్ట్ డుబోయిస్ విషయంలో ఇలాగే జరిగింది. లైంగికదాడి, హత్య వంటి ఆరోపణలపై అరెస్ట్ అయిన అతడికి కోర్టు మరణ శిక్ష విధించింది. తర్వాత దీనిని యావజ్జీవిత ఖైదుగా మార్చింది. అయితే, అతడికి నేరంతో ప్రమేయం లేదని పౌర హక్కుల సంస్థ లోవీ అండ్ లోవీ సాక్ష్యాలతో సహా కోర్టులో నిరూపించింది. దీంతో అతడ్ని విడుదల చేసి.. పరిహారం కింద రూ.119 కోట్లు చెల్లించాలని కోర్టు ఈ ఏడాది జులైలో ఆదేశించింది.