రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య కలలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిధ్రం చేసింది. ‘పీ 4’ జపం చేస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టే కుట్రకు తెర తీసింది. అందులో భాగంగానే ఐదు ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) నుంచి అనుమతులు రాకుండా తాజాగా అడ్డుపడింది అని వైసీపీ నాయకులు వాపోతున్నారు. వారు మాట్లాడుతూ.... ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభమైతే తమకు వైద్య విద్య చదివే అవకాశం లభిస్తుందని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు కూటమి సర్కారు వెన్నుపోటు పొడిచింది. దీంతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రం కోల్పోయింది. సాధారణంగా ముఖ్యమంత్రులంతా కొత్తగా వైద్య కళాశాలలకు అనుమతులు రాబట్టి విద్యార్థులకు అదనంగా ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా.. ఎన్‌ఎంసీ సీట్లు ఇస్తామన్నప్పటికీ మాకు వద్దని రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసిన దుస్థితి చంద్రబాబు పాలనలో ఏపీలో నెలకొంది. గత ప్రభుత్వం తలపెట్టిన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను గుజరాత్ పీపీపీ మోడల్‌లో ప్రైవేట్‌కు కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఐదు వైద్య కళాశాలలకు కుట్రపూరితంగా ప్రభుత్వమే పొగ పెట్టింది. మరోవైపు వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు వైద్య కళాశాలల నిర్మాణ పనులను ఇప్పటికే ప్రభుత్వం అటకెక్కించింది. వీటి ద్వారా వచ్చే ఏడాది అందుబాటులోకి రావాల్సిన వెయ్యికి పైగా ఎంబీబీఎస్ సీట్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు మెరుగుపడటంతోపాటు పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువలో అందుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రతి పార్లమెంట్ నియోజక వర్గానికి ఒక మెడికల్ కాలేజీని నెలకొల్పాలని గత ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే మరింత మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలు అందుబాటులోకి వస్తాయి. బోధనాస్పత్రులకు వచ్చే రోగులకు సులభంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. తద్వారా పోటీతత్వం పెరిగి ప్రైవేట్ రంగంలో కూడా వైద్య చికిత్స వ్యయం తగ్గుతుంది. అయితే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన కూటమి సర్కారు ప్రైవేట్ పాట పాడుతోంది అని అన్నారు.