వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన శానిటేషన్ పనులపై సంబంధిత అధికారులకు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి మంత్రి నారాయణ ఈరోజు(గురువారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పాయకాపురం, ఉడా కాలనీ, జర్నలిస్టు కాలనీ, కండ్రిక, ఆంబాపురంలో బాధితులను పరామర్శించి వారికి అందుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో స్వల్పంగా ఉన్న వరద నీటిని బయటకు పంపింగ్ చేయడంపై అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడారు. పాయకాపురం నుంచి ముస్తాబాద్ వరకూ బుడమేరు ప్రవహించే మార్గాన్ని పరిశీలించారు. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో నిల్వ ఉన్న నీటిని త్వరితగతిన బుడమేరులోకి తరలించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. విజయవాడలో మొత్తం 32 డివిజన్లలో నీరు దాదాపు తగ్గిపోయిందని తెలిపారు. ఒకటి రెండు డివిజన్లలో వరద నీరు కొద్దిగా నిల్వ ఉందని చెప్పారు. నీటిని బయటకు పంపింగ్ చేసేందుకు అవసరమైన చోటా రోడ్లకు గండ్లు కొడుతున్నామని అన్నారు. రేపు(శుక్రవారం) సాయంత్రానికి మొత్తం నీరు బయటకు పంపింగ్ చేస్తామని వెల్లడించారు. అన్ని డివిజన్లలో శానిటేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తుందని అన్నారు. వరద ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి వస్తుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.