ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌కు కేంద్ర బృందాలు వెళ్లాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర బృందంలోని అధికారులు ఈరోజు(గురువారం) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చించారు. గత రెండు రోజుల నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయి. వరద నష్టంపై కూటమి ప్రభుత్వం చేపట్టిన ఎన్యూమరేషన్ గురించి సీఎం చంద్రబాబు కేంద్ర అధికారులకు వివరించారు. ఇప్పటికే ఏపీలో భారీ వర్షాలతో రూ. 6, 882 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్రానికి ఏపీ నివేదిక పంపించిన విషయం తెలిసిందే. ఏపీలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర బృందాలను సీఎం చంద్రబాబు కోరారు. పంట నష్టంతో పాటు.. భారీగా ఆస్తి నష్టం జరిగిందనే విషయాన్ని కేంద్ర బృందాలకు సీఎం చంద్రబాబు వివరించారు. అనంతరం ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో సంబంధిత అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలలు జారీ చేశారు. రైతుల భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. గ్రామాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తున్నట్లు వివరించారు. హార్టికల్చర్, ఆక్వా పంటలు, ఫుడ్ ప్రాసెసింగ్ సహకారంతో రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు ఆహార శుద్ది ద్వారా విలువ పెరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.