విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి కొంతమంది పాఠశాలల విద్యార్థులు సైతం ముందుకు వస్తున్నారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురంలోని నోబుల్ స్కూల్, కడపలోని శ్రీ సాయి విజ్ఞాన్ స్కూల్ విద్యార్థులు స్వచ్ఛందంగా తమ పాకెట్ మనీని విరాళంగా ఇవ్వడం తన హృదయాన్ని కదిలించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నిస్వార్థంగా విరాళం అందించిన విద్యార్థులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నానని వెల్లడించారు. విద్యార్థులు మానవత్వంతో స్పందించి అందించిన సహాయం వారిలోని సామాజిక బాధ్యత, స్ఫూర్తిదాయకంగా నిలచిందని పవన్ కల్యాణ్ అన్నారు. వారు చూపిన ఉదారతే వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా నడిపిస్తూ ఉజ్వల భవిష్యత్తు అందిస్తుందన్నారు. వీరి దయార్ధ హృదయం చుట్టుపక్కల వారిపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. ఆ చిన్నారులు ఆశావాహ దృక్పథానికి, మానవత్వానికి దీప కాంతులుగా ప్రకాశించాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.