పెళ్ళిపేరుతో సుమారు యాభైమందిని మోసగించిన కేసులో అరెస్టయిన ఈరోడ్ జిల్లాకు చెందిన యువతి సంధ్యకు మద్రాసు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. తిరుప్పూరు జిల్లా తారాపురానికి చెందిన మహేష్ అరవింద్ అనే యువకుడు ఆన్‌లైన్‌లో వధువు కోసం అన్వేషిస్తుండగా సంధ్యతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారు వివాహం చేసుకున్నారు. సంధ్యకు వివాహ సమయంలో మహేష్ అరవింద్ కుటుంబీకులు 12 సవర్ల నగలు కానుకగా ఇచ్చారు. కొద్ది రోజులపాటు సవ్యంగా సాగిన వీరి కాపురం ఉన్నట్టుండి మలుపు తిరిగింది. సంధ్య ఫోన్‌లో పలువురు యువకులతో అశ్లీలంగా తీసుకున్న ఫొటోలు కనిపించడంతో మహేష్ దిగ్ర్బాంతిచెందాడు. ఆ విషయమై ఇద్దరూ గొడవపడ్డారు. ఆ నేపథ్యంలో ఉన్నట్టుండి సంధ్య ఇంటి నుండి పారిపోవటంతో మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుప్పూరు. పోలీసుల విచారణలో సంధ్య పారిశ్రామికవేత్తలు, ఇంజనీర్లు సహా సుమారు 50 మందిని పెళ్ళి చేసుకుని నగలు, నగదు దోచుకుని మోసగించినట్లు వెల్లడైంది. సంధ్యను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఆమె బెయిలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది. అందులో తనను అరెస్టు చేసి రెండు నెలలు గడిచినా పోలీసులు ఇంకా ఛార్జిషీట్ దాఖలు చేయలేని, ఈ కారణంగా తనకు బెయిలివ్వాలని కోరింది. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి పి. ధనపాల్ ఆమెకు బెయిలు మంజూరు చేశారు.