వరద సహాయక చర్యల్లో పాల్గొన్న పారిశుద్ద్య కార్మికులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సన్మానించారు. వరద అనంతరం ప్రాంతాలను క్లీన్ చేయడంలో కార్మికుల కృషి చెప్పలేనిదంటూ వస్త్రాలను పురందేశ్వరి అందచేశారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. విజయవాడ, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. గత పది రోజులుగా విజయవాడలో ఎక్కువ భాగం ముంపులోనే ఉందన్నారు. ఇప్పటికే కొంత నీరు నివాసాల మధ్యలోనే ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని పురందేశ్వరి అన్నారు. సీఎం చంద్రబాబు కలెక్టర్ ఆఫీస్ లోనే ఉంటూ.. పర్యవేక్షణ చేస్తూ తీసుకున్న చర్యలు ఆదర్శనీయమని పురందేశ్వరి పేర్కొన్నారు. వేలాది మంది పారిశుద్ద్య కార్మికులను రంగంలోకి దించి.. ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాలను శుభ్రం చేశారని కొనియాడారు. ఈ విపత్తులో కీలక పాత్ర పోషించిన కొంతమంది పారిశుద్ద్య కార్మికులను బీజేపీ పక్షాన సన్మానించి.. ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. ఈ వరదల నుంచి ప్రజలను గట్టెక్కెంచేందుకు ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు అందరూ బాగా పని చేశారన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావంతులతో పురందేశ్వరి సమావేశం అయ్యారు.