ఎడ తెరపి లేకుండా భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరానికి వరద నీరు పొటెత్తడంతో వేలాది మంది సర్వం కోల్పోయారని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. రోజు కూలి పనులు చేసుకునే వారు సైతం ఆ జాబితాలో ఉన్నారన్నారు. నగర ప్రజల కష్టాలు, బాధలు తనను తీవ్ర ఆవేదనకు గురి చేశాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తన వంతు బాధ్యతగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 5 లక్షల విరాళంగా అందజేశానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా.. పోరాటాలు చేసిన కార్యకర్తలు సైతం ఈ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయారని సోదాహరణగా వివరించారు. దాంతో టీడీపీ కోసం పని చేసిన కార్యకర్తలను ఆదుకునేందుకు తాను మళ్లీ ముందుకు వచ్చినట్లు చెప్పారు. వారి నివాసాల్లోని టీవీలు, ఫ్రీజ్‌లతోపాటు ఇతర గృహోపకరణాలు సైతం పాడైపోయాయని తెలిపారు. వారందరికీ తమ కుటుంబ సభ్యుల ద్వారా ఆయా వస్తువులు ఇచ్చేందుకు ఏర్పాట్లు సైతం చేసినట్లు ప్రకటించారు. అయితే తాను ప్రస్తుతం వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నానన్నారు. ఆ కారణంగా హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తాను ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. దీంతో తాను రాలేక పోయినా.. టీడీపీ కోసం పని చేసిన కార్యకర్తలకు తన వంతుగా ఈ సాయం అందిస్తున్నాట్లు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న వివరించారు. ఇంక ఎవరైనా తనతో కలిసి నడిచి.. పార్టీ కోసం పని చేసి వరదల్లో నష్టపోయిన వారి వివరాలను తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వారందరికీ తన వంతుగా తప్పకుండా సాయం అందిస్తానని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.