చిత్తూరు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జిల్లాలోని మొగిలి ఘాట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు రెండు లారీలను ఢీకొట్టగా 8 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి.దుర్ఘటనలో మరణించిన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. రెండు లారీలను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.చిత్తూరు, బెంగళూరు జాతీయ రహదారిపై పలమనేరు నుంచి తిరుపతివైపు వస్తున్న ఆర్టీసీ బస్సు పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న రెండు లారీలను ఢీ కొట్టింది. అనంతరం పక్క రోడు నుంచి వెళ్తుతున్న టెంపోవ్యాన్‌ను కూడా ఢీకొట్టింది. ఆయా వాహనాల్లో ఉన్న ప్రయాణికుల్లో 8 మంది మృతి చెందగా మరో 30 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పలమనేరు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.